ప్రతిఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఓ బ్లాక్ డ్రెస్ తప్పకుండా ఉంటుంది. ఔట్‌ఫిట్‌ను బ్లాక్ డ్రెస్ మరో మెట్టు ఎక్కిస్తుంది. అయితే, రెండుమూడు సార్లు వాష్ చేయగానే.. నలుపు రంగు వెలిసిపోయినట్లు కనిపిస్తుంది. ఎంత బ్రాండెడ్ అయినా, ఖరీదైనా.. ఏదో ఒక సమయంలో ఈ సమస్య తప్పకుండా వస్తుంది. అలాకాకుండా ఉండాలంటే.. కింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
వేడినీళ్లు, ఆవిరితో పనిచేసే వాషింగ్ మెషీన్లలో బ్లాక్ డ్రెస్‌ను వేయకపోవడమే బెటర్. దుమ్ముతోపాటు నలుపు రంగుకూడా వదిలిపోయే అవకాశం ఉంటుంది. బ్లాక్ కలర్ ఫేడ్ అవుట్ కావొద్దంటే.. చన్నీళ్లతోనే ఉతకాలి.
వాషింగ్ మెషీన్లో ఉతికినప్పుడు పూర్తిగా డ్రై అయ్యేదాకా అలాగే ఉంచొద్దు. అలాచేస్తే.. కలర్ వెలిసిపోతుంది. కాబట్టి, నలుపు దుస్తులు కాస్త తడిగా
ఉన్నప్పుడే బయటికి తీసి.. గాలి తగిలేలా నీడలోనే ఆరేయాలి.
దుస్తులను ఎండలో, ఎక్కువసేపు ఆరేయడం కూడా మంచిదికాదు.
వైట్ వెనిగర్.. నేచురల్ ఫ్యాబ్రిక్ రీఫ్రెషర్గా పని చేస్తుంది. బ్లాక్ కలర్ ఫేడ్ కాకుండా కాపాడుతుంది. నల్లని దుస్తులను ఉతికే నీళ్లలో ఓ కప్పు వైట్ వెనిగర్ కలిపితే.. ఫేడ్ అయిన డ్రెస్ కూడా తళతళా మెరిసిపోతుంది.
రసాయనాలు ఎక్కువగా ఉండే డిటర్జెంట్ వాడినా.. రంగు వెలిసిపోతుంది. నలుపు, నీలం లాంటి ముదురు రంగు దుస్తుల కోసం ప్రత్యేకమైన డిటర్జెంట్స్ ఉంటాయి. ఇవి దుస్తుల రంగు పోకుండా, ఫేడింగ్ కాకుండా నిరోధిస్తాయి. వాటిని వాడితే మంచి ఫలితం ఉంటుంది.