చటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో(54 బంతులు మిగిలి ఉండగానే) ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(28 బంతుల్లో 60, 7ఫోర్లు, 4సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమయ్యాడు.
బంగ్లా బౌలర్లను సులువుగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో చెలరేగాడు. ఇస్లాం, నసుమ్ అహ్మద్, రిశాద్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత స్పెన్సర్ జాన్సన్ (4-0-6-2), నాథన్ ఎలీస్(2-21), ఆడమ్ జంపా(2-22) ధాటికి బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ తౌహిద్ హృదయ్(61 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.