సిటీబ్యూరో, అక్టోబర్ 30(నమస్తేతెలంగాణ) : జేఎన్టీయూ గుర్తింపు పొందిన కళాశాలల్లో అధ్యాపకులు రెండుచోట్ల చెప్పే బోధన విధానానికి స్వస్తి పలుకుతున్నారు. యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో నకిలీ ఫ్యాకల్టీకి కాలం చెల్లేలా యూనివర్సిటీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆయా కాలేజీల్లో ఫ్యాకల్టీని యూనివర్సిటీ తమ నియంత్రణలోకి తీసుకుంటుంది. ఇందుకోసం అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ సేకరిస్తున్నారు. కాలేజీ వారీగా బయోమెట్రిక్ అటెండెన్స్‌ను జేఎన్టీయూ డాష్‌బోర్డుపై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వెబ్‌సైట్‌ను లింకు చేస్తున్నారు. దీనివల్ల కొన్ని అఫిలియేటెడ్ కాలేజీలు పాల్పడే నకిలీ ఫ్యాకల్టీ విధానానికి అడ్డుకట్ట పడనుంది. అంతేకాదు కాలేజీలు ఎంపిక చేసుకొని, యూనివర్సిటీ ధ్రువీకరించిన సిబ్బంది మాత్రమే పాఠాలు బోధించడానికి అర్హత ఉంటుంది.
బోగస్ సర్టిఫికెట్లతో చలామణి
కొన్ని ప్రైవేటు కాలేజీల్లో బోగస్ సర్టిఫికెట్లతో ఫ్యాకల్టీగా చలామణి అవుతున్నారు. ఆ జాబితాలో పీహెచ్డీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పలు చర్యలు తీసుకుంటున్నట్లు యూనివర్సిటీ వీసీ ప్రొ.కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.మంజూర్‌హుస్సేన్ తెలిపారు.
యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు అనుసంధానం
జేఎన్టీయూ పరిధిలోని అన్ని అఫిలియేటెడ్ కాలేజీల్లో మొత్తం 89,531 మంది బోధన సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. అకడమిక్ ఆడిట్ సెల్లో నమోదు చేసుకున్న కాలేజీ లెక్చరర్లకు 20 రోజులుగా బయోమెట్రిక్ అటెండెన్స్ స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 50 కాలేజీలకు పైగా ఫ్యాకల్టీ బయోమెట్రిక్ అటెండెన్స్ లింకును యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేశారు. విద్యార్థుల హాజరును కూడా బయోమెట్రిక్ ద్వారే స్వీకరిస్తున్నా, ఆ వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు లింకు చేయడం లేదు. హాజరుశాతం తక్కువున్న విద్యార్థులను సెమిస్టర్ పరీక్షలకు అనుమతించమని అధికారులు తెలిపారు.