అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన నాటినుంచీ ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులే కాక, సగటు సినీ ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చిత్ర దర్శకుడు అట్లీ. తాజాగా ఆయన బెంగళూర్‌లో జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘AA 22’ గురించి మాట్లాడారు. ‘ఏదైనా మొదలయ్యేది ఒక్క ఆలోచనతోనే. అలాంటి ఓ అద్భుతమైన ఆలోచనే ‘AA 22’.
ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆడియన్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. దైవాన్ని తోడుగా తీసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని నడిపించే బాధ్యత ఆయనదే. ఆయన దయతోనే అనుకున్నది సాధిస్తాం. ఇంత భారీ సినిమా చేస్తున్నా మాకు రిస్క్ అనిపించడంలేదు. మేం దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మరి కొన్ని నెలల్లో మీరు కూడా దీన్ని ఆస్వాదిస్తారు.’ అని పేర్కొన్నారు అట్లీ.