‘కల్కి-2’ సినిమా నుంచి దీపికా పడుకోన్‌ను తప్పించడం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు సినీప్రియుల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. ఈ వివాదం గురించి దీపికా పడుకోన్ పలు ఇంటర్వ్యూల్లో పరోక్షంగా ప్రస్తావన తీసుకొస్తున్నది. దీంతో ఈ కాంట్రవర్సీ ఇప్పట్లో ముగిసిపోయేలా లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ‘కల్కి-2’ వంటి ప్రతిష్టాత్మక ఫ్రాంఛైజీ నుంచి దీపికా పడుకోన్ వైదొలగడంతో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం దీపికా స్థానంలో అలియాభట్ నటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని, అన్నీ ఫైనలైజ్ అయ్యాక అధికారిక ప్రకటన వెలువడుతుందని ముంబయి సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ‘కల్కి-2’ చిత్రంలో దీపికా స్థానంలో నటించే కథానాయిక విషయంలో ఇప్పటికే పలువురు అగ్ర తారల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చిత్రబృందం నుంచి అధికారికంగా వెలువడితేనే ఈ విషయంలో స్పష్టత వస్తుందంటున్నారు. ఇదిలావుంటే.. ‘కల్కి-2’ చిత్రానికి ‘కర్ణ 3102 బీసీ’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.