Andhra Pradesh | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నేటి ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25లోక్‌సభ స్థానాలకు మే13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు కోసం ప్రత్యేకంగా కేంద్రం నుంచి 50 సీఆర్పీఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది.
ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, సీఆర్పీఎఫ్ చీఫ్ చారుసిన్హా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరిలో అలజడి చెలరేగింది. తర్వాతకూడా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఏపీ వ్యాప్తంగా హింస చెలరేగే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
అల్లర్లు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపాలని చెప్పారు. ఈ మేరకు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కేంద్ర సాయుధ బలగాలు, ఇతర రాష్ర్టాల పోలీసులను రప్పించారు. ఎస్పీ మల్లికాగార్గ్ పల్నాడు జిల్లాలో అత్యంత్య పకడ్బందీ చర్యలు చేపట్టారు.
పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నర్సరావుపేట పార్లమెంట్ కౌంటింగ్ జేఎన్టీయూ కాలేజ్‌లో జరగనుంది. ఈ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్స్ పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌తో పాటు పోలీస్ 30 యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ విధించారు. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నివాసాలు, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. ఓట్ల లెక్కింపు రోజే కాకుండా మరో పదిహేను రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీసుల నిఘాలోనే ఉండనుంది.
తొలి ఫలితం ఇకడే..
ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఏపీలో అధికారం ఎవరిదనేదానిపై ఓ స్పష్టత రానుంది. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కొవ్వూరు, నరసాపురం స్థానాలకు తొలుత ఫలితాలు వచ్చే అవకాశముంది. ఈ రెండుచోట్లా 13రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. లెక్కింపు ప్రారంభమైన ఐదుగంటల్లోనే ఫలితాలు వెల్లడికానున్నాయి.