న్యూఢిల్లీ: భారత క్రికెట్లో మరో అలజడి రేగింది. మొన్న కెప్టెన్సీ మార్పు విషయంలో వివాదం చెలరేగగా.. తాజాగా సీనియర్లను శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ప్రకంపనలు మొదలయ్యాయి. కొందరు తనను బలవంతంగా రిటైర్మెంట్ తీసుకోమని కోరారని భారత సీనియర్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను ఒక రూమ్‌లోకి పిలిచి మాట్లాడడన్న సాహా పలు విషయాలు వెల్లడించాడు. ‘ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వికెట్‌కీపర్‌గా కొత్త వారి కోసం చూస్తున్నాయి. నువ్వు తొలి ప్రాధాన్య వికెట్‌కీపర్ కావు, కొన్ని రోజులు నువ్వు జట్టుకు ఆడకపోవచ్చు. ఈ సమయంలో యువ కీపర్‌ను సానబట్టేందుకు ప్రయత్నిస్తాం. శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికకాకపోతే షాక్‌కు గురికావొద్దు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తీసుకో’ అని ద్రవిడ్ అన్నట్లు సాహా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే పది రోజుల తేడాతో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ కూడా తనతో ఫోన్లో మాట్లాడినట్లు సాహా పేర్కొన్నాడు. శ్రీలంక సిరీస్‌తోనేనా లేకపోతే రానున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లకు కూడా నన్ను ఎంపిక చేయరా అని ఆయనను ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చాడు. దానికి చేతన్ స్పందిస్తూ ‘ఇప్పటి నుంచి తనను పరిగణనలోకి తీసుకోబోం’ అని చెప్పినట్లు సాహా తెలిపాడు.