ఢాకా: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు చుక్కెదురైంది. లీగ్ దశలో ఓటమి ఎరుగకుండా సెమీస్‌కు చేరిన భారత్.. మంగళవారం కీలక పోరులో 3-5తో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన రౌండ్ రాబిన్ ఆఖరి పోరులో జపాన్‌పై ఆరు గోల్స్ తేడాతో గెలిచిన మనవాళ్లు.. సెమీఫైనల్లో పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. జపాన్ తరఫున షోటా యమడా (1వ నిమిషంలో), రైకీ ఫుజిషిమా (2వ), యోషికి కిరిషితా (29వ), కోసెయి కవాబే (35వ), ర్యోమా ఊక (41వ) ఒక్కో గోల్ చేయగా.. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (17వ, 58వ నిమిషాల్లో) రెండు, హర్మన్‌ప్రీత్ సింగ్ (43వ) ఓ గోల్ కొట్టారు. మ్యాచ్ ఆరంభమైన రెండు నిమిషాల్లోనే ప్రత్యర్థికి రెండు గోల్స్ సమర్పించుకున్న భారత్.. ఇక ఆ తర్వాత ఏ స్థాయిలోనూ పుంజుకోలేకపోయింది. ఒత్తిడిలో పదే పదే తప్పులు చేసిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థులకు ఇతోధిక సాయం చేయగా.. ఆదివారం మ్యాచ్‌లో కేవలం ట్రైలర్‌తో సరిపెట్టిన జపాన్.. సెమీస్‌లో మనవాళ్లకు సినిమా చూపించింది. మరో సెమీఫైనల్లో దక్షిణ కొరియా 6-5 తేడాతో పాకిస్థాన్‌పై నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం కాంస్యం కోసం జరుగనున్న పోరులో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.