ఢాకా: ఆసియా ఆర్చరీ టోర్నీలో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. కాంపౌండ్ మిక్స్‌డ్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ ద్వయం 156-154తో కజకిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో ఆర్చరీ ద్వయం అద్భుత పోరాట పటిమ కనబరిచింది. రికర్వ్ మహిళల సెమీఫైనల్లో అంకిత బక్త్, మధు వెద్వన్, రిధి ద్వయం 6-0 (51-48, 56-50, 53-50)తో వియత్నాంపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
పురుషుల రికర్వ్ సెమీస్‌లో భారత్‌కు ఉత్కంఠ విజయం లభించింది. కపిల్, ప్రవీణ్ జాదవ్, పార్త్ సోలంకి ద్వయం 4-4 (53-53, 53-56, 56-56, 56-55)తో మ్యాచ్‌ను ‘టై’గా మార్చింది. అయితే షూటాఫ్ నిర్వహించగా వాటిలో కూడా ‘టై’ కావడంతో ఇరు జట్ల గణాంకాలను పరిశీలించి నిర్వాహకులు భారత్ విజయం సాధించిందని ప్రకటించారు. రికర్వ్ మిక్స్డ్ సెమీ ఫైనల్లో కపిల్, అంకిత జోడీ 4-4 (40-37, 36-37, 36-38, 37-36)తో మహ్మద్ హకీమ్- దియా సిద్దిఖీ (బంగ్లాదేశ్) జోడీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. షూటాఫ్ నిర్వహించగా 19-20తో బంగ్లా ద్వయం గెలిచింది. కాంపౌండ్ పురుషులలో భారత త్రయం యాదవ్, అభిషేక్ వర్మ, అమన్ సైనీ పాయింట్ తేడా (229-230)తో కజకిస్థాన్ చేతిలో ఓడి ఫైనల్ బెర్త్ అవకాశాన్ని చేజార్చుకుంది. కాంపౌండ్ మహిళల విభాగం సెమీస్‌లో 220-227తో భారత మహిళలు ఓటమి పాలయ్యారు.