
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సైంటిఫిక్ రిసెర్చ్ బ్రాంచ్ హైదరాబాద్‌లోనే కొనసాగనున్నది. పురాతన కట్టడాల పరిరక్షణ, పునఃనిర్మాణంలో కీలకపాత్ర పోషించే ఈ బ్రాంచ్‌ను ముంబైకి తరలించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అద్భుతమైన, చారిత్రాత్మక వారసత్వ సంపద కలిగిన రాష్ట్రంలో దాదాపు 65 ఏండ్ల క్రితమే ఏర్పాటైన ఈ బ్రాంచ్‌ను తరలించొద్దని కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణ, ఏపీలో మొత్తం 139 చారిత్రక కట్టడాలు ఏఎస్ఐ పరిధిలో ఉన్నాయని, తాజాగా రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన నేపథ్యంలో దాని ప్రాధాన్యం మరింత పెరిగిందని వివరించింది. రామప్ప తరహాలో హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రిసెర్చ్ సెంటర్ తమకు ఎంతో అవసరమని తెలిపింది. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్‌లోనే రిసెర్చ్ బ్రాంచ్‌ను కొనసాగించడంతో పాటు కొత్త పోస్టులను సైతం మంజూరు చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న చర్యలతోనే ఇది సాధ్యమైందని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ తెలిపారు. రిసెర్చ్ బ్రాంచ్ అవసరాలు పెరిగిన దృష్ట్యా హైదరాబాద్‌కు అదనపు పోస్టులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.