ధర్మారం, నవంబర్ 22 : స్వరాష్ట్రంలో కళాకారులకు, తెలంగాణ భాషకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నర్సింహులపల్లిలో నిర్వహించిన ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ధ్రువ పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్యపాలనలో తెలంగాణ కళాకారులు తీవ్ర నిరాదరణకు గురయ్యారని గుర్తుచేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌తో తెలంగాణ భాషకు, కళాకారులకు ఎంతో గుర్తింపు దక్కిందని చెప్పారు.
గొల్ల, కుర్మల వారసత్వ ఒగ్గుడోలు కళకు తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. ఆ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ఒగ్గుడోలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో కళపై ఆసక్తి పెరుగుతున్నదని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నర్సింహులపల్లి ఒగ్గుడోలు కళాకారుడు బొప్పనపల్లి ఐలయ్య భావితరాలకు మేలు జరిగేలా 21 రోజుల పాటు యువతకు శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయమని అభినందించారు. ఈ సందర్భంగా ఒగ్గుడోలు కళాకారుడు ఐలయ్య మంత్రి ఈశ్వర్‌ను సన్మానించారు.