హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ పథకం కింద పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన పాల ప్యాకెట్‌ను, ఆరోగ్యలక్ష్మి మొబైల్ యాప్‌ను సోమవారం ఆవిష్కరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మహిళాలోకమంతా రుణపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లులకు పంపిణీ చేస్తున్న పాల ప్యాకెట్లు పకదారి పట్టకుండా చూసేందుకే కొత్త ప్యాక్‌లను ముద్రించామని చెప్పారు.
తెలంగాణ, ఏపీలో మాత్రమే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లులకు పాలు అందుతున్నాయని చెప్పారు. అంగన్వాడీల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఏడేండ్లలో మూడుసార్లు వేతనాలను పెంచడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% ఫిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళా ప్రాంగణాలను మరింత విస్తరించి కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత తెలిపారు. ప్రస్తుతం అంగన్వాడీలు 14 రకాల రిజిస్టర్లను నిర్వహించాల్సి వస్తున్నదని, ఆరోగ్యలక్ష్మి యాప్ రాకతో ఈ బాధ తప్పుతుందని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు.