‘అల్లం అర్జున్ కుమార్ చాలా అమాయకుడు. నచ్చిన చిన్నదాన్ని పెళ్లాడి జీవితంలో సెటిలైపోవాలన్నది అతని లక్ష్యం. కానీ పెళ్లి ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించవు. ఇక జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతానేమో అని సందేహిస్తున్న తరుణంలో ఓ అందాలరాశి అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. వీరి ప్రణయం.. పరిణాయానికి ఎలా దారితీసిందన్నదే మా సినిమా ఇతివృత్తం’ అన్నారు విద్యాసాగర్ చింతా. ఆయన దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. బాపినీడు, సుధీర్ నిర్మాతలు. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘విశ్వక్సేన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ఆద్యంతం హాస్యప్రధానంగా మెప్పిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పవి కె పవన్, సంగీతం: జై క్రిష్, కథ, మాటలు, స్క్రీన్ప్లే: రవి కిరణ్ కోలా, దర్శకత్వం: విద్యాసాగర్ చింతా.