న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : రాజ్యాంగ, ప్రజాస్వామ్య నిబంధనలు, విలువలను అణగదొక్కి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ దేశ ఎన్నికల ప్రక్రియలో భారీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆరోపించింది. ఓట్ల చోరీకి పాల్పడుతూ అధికార బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న ఆయనకు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని పేర్కొంది. 2024 ఎన్నికల్లో అక్రమాలకు కర్త, కర్మ, క్రియ జ్ఞానేశ్ కుమారేనని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 48 గంటల్లోగా ఆయన రాజీనామా చేయకుంటే జంతర్ మంతర్ 2.0 రావడం ఖాయమని హెచ్చరించారు.
ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మిగతా ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని దీప్కే తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. ‘జ్ఞానేశ్ కుమార్ ఈ దేశానికి అతిపెద్ద ద్రోహి. ఆయన పెద్ద జాతి వ్యతిరేకి, అలాంటి వ్యక్తి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగాన్ని బలహీన పరుస్తున్నారు.’ అని దీప్కే పేర్కొన్నారు. దేశంలో 30 రాష్ర్టాల్లో 13 కోట్ల ఓట్లను తొలగించారని, అది మొత్తం ఓట్లలో 13-14 శాతమని విమర్శించారు. ‘మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలే తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. తాము ఎవరికి ఓటు వేయాలో వారే నిర్ణయించుకుంటారు. అయితే జ్ఞానేశ్ కుమార్ సీఈసీ అయినప్పటి నుంచి ప్రజలు ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి వేయకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తున్నది’ అని విమర్శించారు.
‘ఇది నిరంకుశ పాలన. ఈ విషయంలో అతిపెద్ద నేరగాడు, అతిపెద్ద జాతి వ్యతిరేకి జ్ఞానేశ్ కుమార్’ అని ఆరోపించారు. దేశంలో ఓట్ల రిగ్గింగ్ జరుతున్నదని నమ్ముతూ ఉంటే విపక్షాలు ఎన్నికల్లో పాల్గొనరాదని ఆయన పిలుపునిచ్చారు. జ్ఞానేశ్ రాజీనామాతో పాటు సర్‌పై ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, సర్ ప్రక్రియ నిలిపివేయాలని, ఇప్పటివరకు జరిగిన సర్‌కు సంబంధించిన రికార్డులన్నీ సుప్రీం కోర్టు లేదా ఒక స్వతంత్ర న్యాయ పర్యవేక్షణ సంస్థకు అప్పగించాలన్నది తమ ప్రధాన డిమాండ్లని ఆయన తెలిపారు. దేశంలోని జెన్-జీ తమకు వ్యతిరేకంగా ఉన్నందున వారి ఓట్లను తొలగించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నదని సీజేపీ కో-కన్వీనర్ దాస్ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గం నుంచి 50 వేల ఓట్లు తొలగించారని దీప్కే విమర్శించారు. ఆమె అక్కడ 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని చెప్పారు. అలాగే తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో సుమారు లక్ష ఓట్లను తొలగించారని, అక్కడ ఆయన 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఢిల్లీ మాజీ సీఎం నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తొలగించగా, ఆయన 4-5 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందారు. కేరళలో కూడా ఓట్ల తొలగింపులో పినరయి విజయన్ ఓడిపోయారన్నారు.

ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ్న ఒక పద్ధతి ప్రకారం జరిగాయని అన్నారు. అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ చీలిక, దాని ఎన్నికల గుర్తు తొలగింపు కూడా ఎన్నికల సంఘం పుణ్యమేనని ఆరోపించారు. అక్కడ ఎన్నికల సంఘం తెలివిగా, చురుకుగా వ్యవహరించి పార్టీ గుర్తును అపహరించి వ్యతిరేక గ్రూపునకు కట్టబెట్టిందన్నారు. ‘ఈ దుర్మార్గాలన్నింటికీ బాధ్యులెవరో తెలుసా? ఈ కుట్రలు, కుతంత్రాల వెనుక అసలైన దోషి, నేరగాడు సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ఆయన దేశంలో ఎన్నికలను కేవలం రిగ్గింగు మాత్రమే చేయలేదు. మళ్లీ బీజేపీయే అధికారంలో ఉండేలా చురుగ్గా వ్యవహరించారు’ అని దీప్కే ఆరోపించారు.
ఎన్నికల ప్రక్రియల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. రెండు సభల్లోనూ దీనిపై నోటీసులు అందజేయాలని కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలోని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అభిశంసన తీర్మానానికి సంబంధించిన నోటీస్ తయారవుతున్నదని, వచ్చే వారంలో దీనిని పార్లమెంట్లో సమర్పించవచ్చునని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించమని కోరుతూ విపక్షాలు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ 24న కూడా73 మంది విపక్ష ఎంపీలు ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో నోటీసులు అందజేశారు. కాగా, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ అన్ని పీసీసీలను ఆదేశించింది.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా న్యూఢిల్లీలోని పార్లమెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘జ్ఞానేశ్ కుమార్ ఒక మోసపూరిత ఏజెంట్’ అని ఎక్స్‌లో ఆరోపించారు.