నేను బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు ఎంతోమందికి లోన్లు ఇప్పించాను, అప్పులిచ్చే ఆఫీసర్‌గా, మేనేజర్‌గా ఎందరికో రుణాలు మంజూరు చేశాను కూడా. కానీ, చిన్నప్పుడు, ఆ తరువాత కూడా నేను అప్పుల అప్పలమ్మను. నా కొరకు తక్కువా, ఇతరుల కోసం ఎక్కువగా అప్పులు చేసిన కేరెక్టర్ నాది. ఇప్పుడు తలచుకుంటే వింతగా వుంటుంది గానీ, అది పెద్ద తప్పుగా నాకప్పుడు అనిపించకపోయేది.
బడిలో మా క్లాసులో ఉన్న అమ్మాయిలందరం అంతంత మాత్రమే గానీ, శ్యామల దగ్గర బాగా డబ్బుండేది. బాగా అంటే ఎప్పుడు చూసినా ఇరవై ముప్పై రూపాయలుండేవి. ఎప్పుడూ ఐస్ఫ్రూట్లో, చాక్లెట్లో, రిబ్బన్లో, సైడ్పిన్నులో ఇట్లా ఏవో ఒకటి కొంటూండేది. తను కొన్నప్పుడల్లా ‘నీకు కావాల్నానే? కొనుక్కో!’ అనేది. డబ్బు విషయంలో మనమెప్పుడూ ఫ్రెండ్ ఆఫ్ కుచేలానే. మాకు పెన్సిళ్లో, పెన్నులో, నోటుబుక్కులో కావాల్సి వచ్చి ఇంట్లో అడిగితే నాలుగైదు రోజుల తర్వాత మాత్రమే నాన్న డబ్బులిచ్చేవాడు. ఉండి ఇవ్వకపోవడం కాదు, ఆ మాత్రం నగదు కూడా ఇంట్లో వుండేది కాదు. పావలా, ఆఠాణా అంటే అమ్మ ఇచ్చేది. అయితే, తినే వస్తువులను మేమెన్నడూ బడికి తీసుకెళ్లే అలవాటు లేదు.
తినుబండారాలు మేమెప్పుడూ బయట తిన్నది లేదు. అటుకుల చూడ్వా, ఏపుడు పేలాలు, కారం బిళ్లలు, చేగోడీలు, మురుకులు (వాటిని తేనెతేనలు అనేవారు) లాంటివి ఎప్పుడూ ఏదో ఒకటి ఇంట్లో ఉంటుండేవి. పండుగలప్పుడో, ఏవైనా సందర్భాలప్పుడో కొన్ని స్వీట్లు చేసేవారు. ఇప్పుడు స్వీటు షాపుల్లో దొరికే ఈ స్వీట్ల పేర్లయినా మాకు అప్పుడు తెలియవు. అమ్మ తరచుగా ఇంట్లోనే పాలకోవా, గులాబ్ జామ్ చేస్తుండేది. అందుకని బయట ఏవైనా కొనుక్కుని తినాల్సిన అవసరం గానీ, అవకాశం గానీ మాకు వుండేది కాదు.
ఇంతకూ ఈ మాట ఎందుకొచ్చిందంటే ఓ రోజు శ్యామలా, నేనూ, రాధా మా బడికి ఎదురుగా ఉన్న చిన్న దుకాణంలో పిప్పరమెంట్లు కొనుక్కున్నాం. కొన్ని చేతి గడియారం పిప్పరమెంట్లు రబ్బర్ బాండ్‌తో వుండేవి. పిప్పరమెంటే వాచీ అన్నమాట. పైన వాచీ ఉండి ఆ రేపర్ తీస్తే అడుగున పిప్పరమెంట్ వుండేది. వాటికి శ్యామలే డబ్బులిచ్చింది. అక్కడ పల్లీ పట్టీలు కూడా వున్నాయి. వాటిని చిక్కీలు అనేవారు. రాధ చిక్కీలు కొంటానంటే అవి ముక్కబట్టిన వాసన వచ్చాయి. కొనడం మానుకున్నాం.
నాకెందుకో ఆ చిక్కీలు నేను కొనిస్తే బావుండుననిపించింది. ఎప్పుడు ఏది కొన్నా వాళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఇస్తున్నారు కదా, నేనూ ఓసారి కొందాం అనుకున్నాను. వెంటనే నాలో దానవీరశూరకర్ణ ప్రవేశించాడు. ‘రేపు నేను తీసుకొస్త తియ్యండి’ అన్నాను. ‘ఎహె, ఇంట్ల నుంచి తెచ్చుడు ఏమొద్దు తియ్యి. రేపు మంచివి కొనుక్కుందాం’ అన్నారు వాళ్ళు. ఇచ్చిన మాట వెనక్కు తీసుకోకూడదు గదా, అందుకని ‘ఒద్దొద్దు.. నేనే తెస్త’ అన్నాను.
అన్నానే గానీ, ఎక్కడినుండి తేను? నా దగ్గర ఒక్క ఆఠాణా కూడా లేదు. మెల్లగా రిహార్సల్ వేసుకొని నాన్నను అడిగితే రెండు మూడు రోజుల్లో రూపాయో, రెండో ఇస్తాడు గానీ, మర్నాడే ప్రెస్టేజ్ ఇష్యూ కదా! ఏదో ఒకటి చెయ్యాలి అని ఆపద్బాంధవురాలు నానమ్మను అడిగాను. నానమ్మ దగ్గర కూడా లేవు. ఇక ఏం చేయాల్రా దేవుడా అనుకుంటుంటే పాండురంగం గుర్తొచ్చాడు. పాండురంగం ఎవరో కాదు, నా క్లాస్మేట్. మా ఇంటి దగ్గరే వాళ్లిల్లు. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే వాళ్లకు చిన్న కిరాణా షాపు ఉంది.
చాలాసేపు తటపటాయించి చివరికి ‘ధైర్యే సాహసే రమా’ అనుకుని పాండురంగాన్ని అడిగాను. మూడు పాకెట్లు, చిక్కీలు తెచ్చిపెట్టమనీ, రెండు మూడ్రోజులైనాక డబ్బులిస్తానని. పాండురంగం ఎగిరి గంతేయకపోయినా సరేనని వెంటనే తెచ్చిచ్చాడు. ఎప్పుడైనా పరీక్షల్లో లెక్కల్లో హెల్ప్ చేస్తాననో ఏమో మా క్లాస్మేట్స్ ఎవరూ నా మాట కాదనేవారు కారు. అది నేను చేసిన మొదటి అప్పుగా చరిత్రలో (నా చరిత్రే సుమా!) నిలిచిపోయింది. రెండు మూడు రోజులకు ఆ అప్పు తీర్చేసాను.
అయితే ఆ తరువాత పద్మకు పరీక్ష రాయడానికి తెల్ల కాయితాలు లేవనో, సుగుణ పెన్సిల్ అడిగిందనో, ఎవరైనా ఎరేజర్ అడిగారనో నేను వెంటనే నా దగ్గర వున్నవి ఇచ్చేసి, నేను పాండురంగం దగ్గర అప్పుచేసి కొనుక్కునేదాన్ని. అతడు కూడా నా క్రెడిట్ స్కోరు బావుండడంతో అడిగిందే తడవుగా లేదనకుండా అప్పిచ్చేవాడు. ఓ సారి చాలా పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. డైరెక్టుగా పాండురంగం ఇంటికే వచ్చేశాడు. నేను ఇంటి లోపల్నుంచి బయటికి వచ్చేసరికి ‘ఏం పైసలు? ఎక్కడివి? మీ దగ్గర ఏం కొన్నం? కనుక్కుంట’ వుండు అంటున్నాడు నాన్న. నా గుండెలో ఓ రెండు మూడు కిలోల రాయి పడింది. పాండురంగం అమాయకంగా చిన్నమ్మాయి అప్పుడప్పుడు అవొకటి, ఇవొకటి కొన్నది మా దగ్గర అని చెబుతున్నాడు. నేనెంత సైగ చేసినా అతడు నన్ను చూడ్డమే లేదు. నాన్న వెంటనే అతడికి నేను బాకీపడ్డ రెండ్రూపాయల బారానా డబ్బులిచ్చి పంపించాడు.
ఇక ఆ తరువాత నాకు బ్యాండ్ బజా బారాత్ అయింది. అమ్మ నాకొక పెద్ద క్లాసు పీకింది. ‘ఎవర్నడిగి అప్పు చేసినవ్? నీకంత ధైర్యం ఎక్కడిది? నేనో, నానో ఇయ్యకపోతే నువ్వు ఎక్కడ్నుంచి కడ్తవ్? అసలు నీ దగ్గర లేని పైసలు నీవి ఎట్ల అయితయ్? ఒంటి మీద సోయి వుండొద్దా?’ లాంటి కొన్ని వందల ప్రశ్నలు రెండు మూడు రోజులపాటు నేను ఎటు వెళ్తే అటు ఎదురైనాయి. ఇక నాన్నే నా పాలిట రక్షకుడై ‘పోనీ తియ్యి, ఏదో తెల్వక చేసింది. మళ్లట్ల చెయ్యదులే’ అన్నాకనే ఆ విషయం ఆగింది. అమ్మ అంతటితో ఆగక నా మీద నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసింది. నేనెక్కడ అప్పు చేస్తాననో అక్క కనిపెడుతూ, ఆ ప్రమాదం జరుగకుండా కాపాడుతూ వుండేది.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి