న్యూఢిల్లీ, నవంబర్ 3: స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు లభించింది. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ టీకాల జాబితాలో చేర్చడానికి అనుమతించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో బుధవారం ట్వీట్ చేసింది. కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగం కింద అనుమతికి తమ సాంకేతిక సలహాదారుల బృందం, స్వతంత్ర సలహా కమిటీ సిఫారసు చేసినట్టు వెల్లడించింది. అయితే గర్భిణులకు ఈ టీకాతో భద్రతపై తగిన సమచారం లేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి ఇవ్వడంపై ఆ సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూన్ ఖేటర్‌పాల్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసింది. ఇది తొలినాళ్లలో వ్యాపించిన కరోనా వేరియంట్ల నుంచి 77.8% రక్షణను, డెల్టా వేరియంట్ నుంచి 65.2% రక్షణ కల్పిస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. కొవాగ్జిన్ రెండు డోసుల టీకా. 18 ఏండ్లు నిండినవారికి నాలుగు వారాల వ్యవధితో రెండు డోసులు వేస్తారు.
ఏప్రిల్ 19న దరఖాస్తు
కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి కోసం భారత్ బయోటెక్ ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకొన్నది. టీకా ట్రయల్స్, సమర్థతపై డబ్ల్యూహెచ్‌వో పలుమార్లు అదనపు సమాచారం కోరింది. టీకాకు అనుమతిపై డబ్ల్యూహెచ్‌వో నిపుణుల కమిటీ అనేక సార్లు సమావేశం అయింది. అయితే అనుమతి ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. చివరగా అక్టోబర్ 26న డబ్ల్యూహెచ్‌వో చివరిసారి భారత్ బయోటెక్‌ను అదనపు సమాచారం కోరింది.
విదేశీయానంపై ఆంక్షలుండవు
డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు వల్ల టీకాను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది. కొవాగ్జిన్ వేసుకొన్నవారు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడంపై ఆంక్షలు ఉండవు. విదేశాలకు వెళ్లినప్పుడు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి లేకపోవడంతో ఈ టీకా వేసుకొన్నవారి రాకపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
జీవిత కాలం 12 నెలలకు పెంపు
కొవాగ్జిన్ జీవితకాలాన్ని(ఎక్స్పైరీ) 12 నెలలకు పొడిగించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) ఆమోదం తెలిపినట్టు భారత్ బయోటెక్ సంస్థ బుధవారం వెల్లడించింది. అంటే టీకా తయారు చేసినప్పటి నుంచి ఏడాది దాకా వినియోగించవచ్చు.
77.8% : కొవాగ్జిన్ సమర్థత