హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఆంధ్రా పోలీసులు, పాలకుల తీరు మళ్లీ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు చెందిన జర్నలిస్టులను అరెస్టు చేసిన ఆంధ్రా పోలీసులు వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కేవీఆర్తోపాటు ‘ప్రశ్న’ రావణ్‌ను ఆంధ్రా పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కేవీఆర్ మీద ఒకే ఆరోపణపై వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు కాగా, వంతుల వారీగా ఆయా పోలీసులు ఆయనను తమ కస్టడీలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక భారీ కుట్ర కోణం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
కేవీఆర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు బొబ్బిలి సబ్‌జైలుకు తరలించారు. ఆయన విడుదలైతే వెంటనే అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఆయనను పీటీ వారెంట్‌పై తుళ్లూరుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేవీఆర్‌పై ఉండవల్లిలో కూడా ఫిర్యాదు ఉన్న నేపథ్యంలో అక్కడి పోలీసులు కూడా ఆయనను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇదంతా ఓ ముందస్తు పథకంలో భాగంగా జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం బొబ్బిలి పోలీసుల అదుపులో ఉన్న కేవీఆర్‌ను మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకు మరికొన్ని చోట్ల ఫిర్యాదులు చేయించే అవకాశం ఉన్నదని అతడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం బెయిల్ కోసం పోరాడుతున్నామని.. అది వచ్చేలోపే మరో స్టేషన్‌కు తరలించేందుకు ఏపీ పోలీసులు కుట్రలు పన్నుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. అరెస్టు దగ్గర్నుంచి.. అక్కడి కోర్టుకు తీసుకెళ్లే వరకూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోతున్నారు.
‘తెలంగాణ ప్రభుత్వం నా భర్త అక్రమ అరెస్టుపై స్పందించి.. బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేయాలి’ అని కేవీఆర్ భార్య విజయలక్ష్మి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. గతంలో కూడా కర్నూలు పోలీసులు తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆమె విలపించారు. ‘తెలంగాణ పోలీసులు అండగా ఉంటారేమోనని నా భర్తను సరూర్‌నగర్ స్టేషన్‌కు పంపిస్తే.. వాళ్లు అక్కడ్నుంచి ప్రైవేట్ వాహనంలో ఏపీకి తరలించారు. ఇదెక్కడి అన్యాయం?’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణపై య్యూటూబర్, ఇన్ఫ్లూయెన్సర్ ‘ప్రశ్న’ రావణ్‌ను ఏపీ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. అతడిపై తప్పుడు సెక్షన్లతో కేసులు కట్టినట్టు తెలిసి స్థానిక న్యాయమూర్తులు పోలీసులకు చీవాట్లు పెడుతూ రిమాండ్ రద్దు చేస్తుండటంతో వారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. రావణ్‌ను మొత్తం 35 కేసుల్లో వరుసగా అరెస్టు చేసేలా పథకం రచించినట్టు విశ్వసనీయ సమాచారం. రావణ్‌కు పిఠాపురం కోర్టు.. పోలీసు రిమాండ్ క్యాన్సిల్ చేసి, బెయిల్ ఇచ్చింది.
ఆ వెంటనే సర్పవరం పోలీసులు పీటీ వారెంట్‌తో రాగా.. అక్కడ కూడా బెయిల్ లభించింది. ముందస్తు పథకంలో భాగంగా మచిలీపట్నం, ఏలూరు పోలీసులతో అరెస్టు చేయించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఏపీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ పోలీసుల అదుపులోనే రావణ్ నిరాహారదీక్ష చేపట్టారు. కోర్టులు బెయిల్ ఇచ్చినా కక్షసాధింపునకు పాల్పడుతున్నదని, నిరసనగా నిరాహారదీక్ష చేపడుతున్నట్టు చెప్పారు.