HIT 3 Ticket Hikes | నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ మూడవ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నాని ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా, ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు అవకాశం లేకపోగా, ఏపీలో మాత్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా పెంచుకోవచ్చు. ఈ పెంచిన ధరలు సినిమా విడుదలైన తేదీ నుండి వారం రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.