విజయవాడ: సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు. తప్పు జరిగిందంటే ప్రాయశ్చిత్తం చేసుకోండి.. లేకుంటే మౌనంగా ఉండాలంటూ వైసీపీ నాయకులకు చురకలంటించారు. సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే నన్నెవరూ ఆపలేరన్నారు. ఈ నేల అన్ని మతాలను గౌరవిస్తుందని, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలని చెప్పారు. తప్పు చేసిన వాళ్ల నాశనం మొదలైందని చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..
‘ఈ దేశంలోని సగటు హిందువుకు వేరే మతం, వ్యక్తి మీద ద్వేషం ఉండదు. సనాతన ధర్మం పాటించే వ్యక్తులు ఇతర మతాలను గౌరవిస్తారు. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారు. హైందవ ధర్మాన్ని కాపాడతామని సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలి. నాపై విమర్శలు కాదు.. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతేంటి?. లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోంది. సాటి హిందువులు.. తోటి హిందువులను దూషించడం మంచి పద్ధతి కాదు. బాధ్యత తీసుకున్న వాళ్లనే నేను నిందిస్తున్నా. ఇప్పటికీ వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.
సున్నిత అంశాలపై పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం. తిరుమల లడ్డూపై ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనం దాటి పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. విమర్శించే వైసీపీ నాయకులకు చెబుతున్నా.. సనాతన ధర్మం జోలికి రావద్దు. తప్పు జరిగితే ఒప్పుకోండి. లేకపోతే సంబంధం లేదని చెప్పండి. అంతేగాని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంగా చెబుతున్నా. పొన్నవోలు కూడా హిందువే.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పా?.
ప్రకాశ్‌రాజ్‌కు కూడా చెబుతున్నా.. మీరంటే మాకు గౌరవం ఉంది. సున్నిత అంశాలపై విషయం తెలుసుకుని మాట్లాడాలి. ప్రకాశ్‌రాజ్‌తో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. తప్పు జరిగిందంటే ప్రాయశ్చిత్తం చేసుకోండి. లేకుంటే మౌనంగా ఉండండి. తప్పు చేసిన వాళ్ల నాశనం మొదలైంది. విచారణకు రావాలంటే సుబ్బారెడ్డికి రికార్డులు ఇవ్వాలట. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు రికార్డులు ఇచ్చారా?. ధర్మారెడ్డి ఎక్కడో కనిపించట్లేదు. తిరుమలను ఇష్టారాజ్యంగా మార్చేశారు. సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే నన్నెవరూ ఆపలేరు. ఈ నేల అన్ని మతాలను గౌరవించేది. ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలి’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
వైసీపీ నేతలు నన్ను పచ్చి బూతులు తిట్టినా మౌనంగానే ఉన్నా కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/GJdPVESo2k
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2024