యాచారం, జూన్ 4 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో ‘ప్రజాపాలన-పల్లె ప్రగతి’లో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటుకోసం సేకరించిన రైతుల భూముల్లోకి అధికారులు పోలీస్ బలగాలతో వచ్చి భూములను చదును చేయడం, కరెంట్ సరఫరా నిలిపవేయడం, బోరుబావులు, పశువుల కొట్టాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు, పోలీసులను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. చెప్పాబెట్టకుండా కరెంట్ సరఫరాను ఎలా కట్ చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పొలాలను చదును చేస్తే రైతులు, వ్యవసాయ కూలీలు ఎలా బతికేదని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి, పలువురు రైతులు మాట్లాడుతూ.. కోర్టు స్టే ఉన్నప్పటికీ పోలీసుల సహకారంతో పొలాలను స్వాధీనం చేసుకోవాలని చూడటమేంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, భూములను తిరిగి రైతులకు ఇస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి రాగానే రైతులను విస్మరించినట్టు పేర్కొన్నారు. పైగా ఫ్యూచర్‌సిటీకి భూములివ్వాలని రైతులను బెదిరిస్తున్నట్టు ఆరోపించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు.
ఫార్మాకు ఇవ్వని 2,250 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, వెంటనే ఆన్లైన్లో రైతుల పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అందాల్సిన పూర్తిస్థాయి నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకు ఇస్తామని చెప్పిన ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుర్మిద్దతండా, మర్లకుంటతండా, పోతుబండతండాలకు చెందిన గిరిజన రైతుల భూముల్లో నుంచి వేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రెండు నెలలకు పైగా గిరిజన రైతులు రిలే నిరహార దీక్షలు చేస్తే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. భూములను చదును చేసేందుకు జేసీబీలు, హిటాచీలు, డోజర్లను తీసుకొస్తే వాటిని అడ్డుకుంటామని, ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. పోలీసులు కల్పించుకొని సమస్యలను పరిష్కరిస్తారని, గ్రామసభను నడిపించాలని కోరగా.. గ్రామస్తులు, రైతులు ససేమిరా అంటూ గ్రామసభను అడ్డుకున్నారు. రైతులకు బీఆర్ఎస్ సర్పంచ్ శ్రీవిద్య మద్దతు తెలుపుతూ గ్రామసభను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడంతో అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.