అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘సలార్’ నుంచి ఆశ్చర్యపరిచే ఒక్కో విషయం బయటకొస్తున్నది. ఈ సినిమా ఒక భాగంగా ఉంటుందా రెండు భాగాలుగా ఉంటుందా అనే విషయాన్ని ప్రభాస్ వెల్లడించడానికి నిరాకరించారు. అయితే కొన్ని విషయాలను ఆయన ‘రాధేశ్యామ్’ ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెబుతున్నారు. ‘సలార్’ సినిమాలో శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తర్వాత పృథ్వీరాజ్ దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ ఇమేజ్ ‘సలార్’కు ఉపయోగపడనుంది. భావోద్వేగాలు నిండిన యాక్షన్ కథతో ఈ సినిమా నిర్మితమవుతున్నది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కదిలించే ఎమోషన్ కూడా చిత్రంలో ఉంటుందని ఇటీవల శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.