Anirudh Ravichander | కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ మధ్య విజయ్ అభిమానుల కోపానికి గురవుతున్నారు. కారణం లియో సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST). విజయ్ ఫ్యాన్స్ గత ఏడాది నుంచి లియో సినిమా ఓఎస్టీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పటికీ విడుదల కాలేదు. మరోవైపు, ఇటీవల రిలీజ్ అయిన రజనీకాంత్ కూలీ సినిమాకు మాత్రం సెప్టెంబర్ 10న ఓఎస్టీ రిలీజ్ చేస్తున్నట్లు అనిరుధ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సినిమాని నిర్లక్ష్యం చేస్తూ, రజనీకాంత్ సినిమాకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. లియో కోసం ఎలాంటి శ్రద్ధ పెట్టడంలేదని స్పష్టంగా తెలుస్తోంది అంటూ వారు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలకు ఓఎస్టీ విడుదల చేయడం ఒక ట్రెండ్ అయింది. అభిమానులు ఆ మ్యూజిక్ ట్రాక్‌లను ఉపయోగించి సోషల్ మీడియాలో ఫ్యాన్ వీడియోలు చేయడం, సినిమాపై మళ్లీ చర్చ మొదలు పెట్టడం వల్ల సినిమా బజ్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి హీరో అభిమానులు మ్యూజిక్ డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నారు. లియో సినిమాలో అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకుంది. అందుకే అభిమానులు ఓఎస్టీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కూలీ సినిమా థియేటర్స్‌కి వచ్చి నెల కూడా కాకముందే ఓఎస్టీని రిలీజ్ చేయడం రజనీకాంత్ అభిమానులకు పండగ వాతావరణం కలిగించింది. అయితే అదే ఉత్సాహాన్ని విజయ్ అభిమానులు పొందలేకపోతుండటంపై వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. “ఎందుకు లియో ఓఎస్టీ ఇంకా రాలేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎంతగా కోరినా అనిరుధ్ స్పందించడం లేదని విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇక కూలీ ఓఎస్టీ రిలీజ్‌తో మరోసారి ఈ చర్చ మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికీ అయినా అనిరుధ్ లియో ఓఎస్టీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. విడుదల చేయకుంటే మాత్రం విజయ్ అభిమానుల విమర్శలు మరింత తీవ్రమవడం ఖాయం.