హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): టీఎస్రెడ్కో, టీఎస్ఎఫ్డీసీలకు నూతన చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్‌గా టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ యెరువు సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం నియమితులయ్యారు. వీరు ఈ పదవుల్లో మూడేండ్లపాటు ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ములుగు జిల్లాకు చెందిన యెరువ సతీశ్‌రెడ్డి బీటెక్ పూర్తిచేశారు. 2012 నుంచి 2019 వరకు టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2019 నుంచి టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం కల్పించడంలో సతీశ్‌రెడ్డి కీలక భూమిక పోషిస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను వివిధ మాధ్యమాల ద్వారా ఎండగట్టడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సతీశ్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ వనస్థలిపురంలో నివసిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా రాంనగర్‌కు చెందిన అనిల్ కూర్మాచలం తెలంగాణ ఉద్యమ సమయం నుంచి లండన్‌లో క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారు. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణీయుల మద్దతు కూడగట్టడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ సైన్స్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం యూకేలో ఐటీ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, వికాసంలో అనిల్ తనదైన పాత్ర పోషిస్తున్నారు. కొవిడ్ సమయంలో లండన్‌లో ‘కేసీఆర్ కూపన్స్’ పేరిట అందించిన సేవలు విశేష ప్రాచుర్యం పొందాయి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన అనిల్, సతీశ్‌రెడ్డి
రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన అనిల్ కూర్మాచలం, వై సతీశ్‌రెడ్డి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని అభినందించారు. తమపై నమ్మకంతో ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను అత్యంత పవిత్రంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనిల్ కూర్మాచలం, సతీశ్‌రెడ్డి నియామకం పట్ల సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్లో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు ప్రతిఫలం ఉంటుందని ఈ నియామకాలతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. అనిల్ కూర్మాచలానికి డెన్మార్క్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఫౌండర్ ఆకుల శ్యాం, బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాదారపు సతీశ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.