తాండూర్ : గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ (Anganwadi) టీచర్లుగా, ఆయాలుగా, పలు ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వెలకట్టలేమని జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ ఖాన్ (Rauf Khan) అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అంగన్వాడీలకు శుక్రవారం మండలంలోని కొత్తపల్లి రైతు వేదికలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాధారం-9 అంగన్వాడీ టీచర్ అనసూర్య, కిష్టంపేట-2, కిష్టంపేట-4, బోయపల్లి, తాండూర్ ఐబీ అంగన్వాడీ కేంద్రాల ఆయాలు తార, లక్ష్మి, శంకరమ్మ, చిన్నక్కను రవూఫ్ ఖాన్, బెల్లంపల్లి సీడీపీవో స్వరూపారాణి, అధికారులు, సిబ్బంది పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తొలి పాఠశాల అంగన్వాడీ కేంద్రమే అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్య అభ్యసించిన తనతో పాటు ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. ఐసీడీఎస్ ద్వారా అందుతున్న సేవలను బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజల్లో అంగన్వాడీలు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎఎస్ సూపర్వైజర్ కర్ర రమాదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.