న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో నిలవగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రూ.15 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రులు సమర్పించిన వ్యక్తిగత ఎన్నికల ప్రమాణ పత్రాలు పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది.
ఈ ముఖ్య మంత్రులలో 13 మంది (43 శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ నేరాల్లో హత్య, హత్యాయత్నం, అపహరణ, బెదిరింపుల వంటి కేసులు ఉన్నాయి. ఈ తీవ్రమైన నేరాలన్నీ నాన్-బెయిలబుల్, ఐదేండ్లకు పైగా శిక్ష విధించిన కేసులు కావడం గమనార్హం.