సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సందడి చేయబోతున్నది వ్యాఖ్యాత సుమ. నటిగా ఆమె పునరాగమనం చేస్తున్న తాజా చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌కుమార్ కలివారపు దర్శకుడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను శనివారం అగ్రహీరో రామ్‌చరణ్ విడుదలచేశారు. ఈ పోస్టర్లో రోకలి పట్టుకొని దంచుతూ సుమ కనిపిస్తున్నది. గ్రామీణ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఊరి పెద్దగా కనిపించబోతున్నట్లు సమాచారం. నిర్మాత మాట్లాడుతూ ‘సుమ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. నటిగా ఆమెను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: అనుష్కుమార్.