
బుల్లితెరపై ప్రయోక్తగా రాణిస్తూనే నటనకు ప్రాధాన్యమున్న విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ వెండితెరపై వైవిధ్యతను చాటుకుంటున్నది అనసూయ. తాజాగా ద్విభాషా చిత్రం ‘ఫ్లాష్‌బ్యాక్’లో కొత్త పాత్రలో కనిపించబోతున్నదామె. ప్రభుదేవా, రెజీనా, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డ్యాన్ శ్యాండీ దర్శకత్వం వహించారు. పి.రమేష్ పిైళ్లె నిర్మాత. లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘గుర్తుకొస్తున్నాయి’ చిత్ర ఉపశీర్షిక. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అనసూయ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను చిత్రబృందం విడుదలచేసింది. ‘నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. రెజీనా, అనసూయ పాత్రలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుతున్నాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.