హంగ్జౌ(చైనా): ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో అన్ సె యంగ్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ అన్ సె యంగ్ 21-13, 18-21, 21-10తో వాంగ్ జీ యిపై అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో అన్ సె యంగ్ తనదైన రీతిలో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
తొలి గేమ్‌ను 21-13తో కైవసం చేసుకున్న ఈ యువ షట్లర్‌కు రెండో గేమ్‌లో చుక్కెదురైంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వని ఈ దక్షిణకొరియా షట్లర్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది 11వ టైటిల్ దక్కించుకోవడం ద్వారా జపాన్ దిగ్గజ షట్లర్ కెంటో మెమోటో సరసన అన్ సె యంగ్ నిలిచింది. ఫైనల్‌కు చేరుకునే కనీసం ఒక్క గేమ్‌ను కోల్పోని అన్ సె యంగ్..జపాన్ స్టార్ షట్లర్ అకానె యమగుచిని ఓడించడం విశేషం.