Artificial Intelligence | న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి టాప్ ఏఐ కంపెనీల మాజీ ఉద్యోగులు ఓ బహిరంగ లేఖలో హెచ్చరించారు. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి, వినియోగంలో మెరుగైన పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. ఏఐతో మన జీవితాలు మెరుగుపడటానికి గొప్ప అవకాశం ఉందని, అయితే అది పెను విపత్తును కలిగించగలదని హెచ్చరించారు. ఏఐ కంపెనీలపై ప్రభుత్వాల పర్యవేక్షణ కానీ, వాటి లోపాలను బయటపెట్టేవారికి తగినంత రక్షణ కానీ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం
ఏఐ వల్ల మెడికల్, టెక్నాలజీ వంటి రంగాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని, అయితే సామాజిక అసమానతలు మరింత దారుణంగా పెరుగుతాయని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడంతోపాటు ఏఐ సిస్టమ్స్ మీద నియంత్రణను మనం కోల్పోవచ్చునన్నారు. వీటన్నిటి వల్ల మానవాళి మనుగడకే ముప్పు సంభవించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. విశేషం ఏమిటంటే, ఇటువంటి నష్టాలు పొంచి ఉన్నాయని ఏఐ కంపెనీలు, ప్రభుత్వాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ వీటిపై సమర్థవంతమైన పర్యవేక్షణ లేదు. తమ సిస్టమ్స్ యొక్క రిస్క్ తీవ్రత, వాటి సామర్థ్యాల గురించి చాలా సమాచారం ఏఐ కంపెనీల వద్ద ఉన్నప్పటికీ, ఆ సమాచారాన్ని ప్రజలతో కానీ, ప్రభుత్వాలతో కానీ పంచుకోవలసిన అవసరం లేదు.