Gas and Oil : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఆటంకాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ (India) తన ఇంధన భద్రతను పటిష్ఠం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా (USA) నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) ను, రష్యా (Russia) నుంచి ముడి చమురును తెప్పించుకుంది. ఆ రెండు దేశాలకు చెందిన భారీ నౌకలు మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి.
అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన ‘పైక్సిస్ పయనీర్’ అనే కార్గో నౌక విజయవంతంగా మంగళూరు పోర్టులో లంగరేసింది. ఇదే సమయంలో రష్యా నుంచి ముడి చమురును తీసుకొచ్చిన మరో నౌకను కూడా పోర్టుకు 18 నాటికల్ మైళ్ల దూరంలో నిలిపి ఉంచారు. సింగిల్ పాయింట్ మూరింగ్ వ్యవస్థ ద్వారా ఈ చమురును పైప్లైన్లోకి, అక్కడి నుంచి మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌కు తరలించనున్నారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన ధరలను స్థిరీకరించే లక్ష్యంతో సముద్రంలో అప్పటికే ప్రయాణంలో ఉన్న రష్యా ముడి చమురు అమ్మకాలకు అమెరికా తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. ఇరాన్ ప్రమేయంతో నెలకొన్న వివాదాలవల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో భారత్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఈ వారం గుజరాత్‌లోని వాడినార్, ముంద్రా పోర్టులకు ‘నందా దేవి’, ‘శివాలిక్’ అనే రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు కూడా సురక్షితంగా చేరుకున్నాయి. ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధి గుండా ఇవి రావడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మంది భారత నావికులతో కూడిన 22 భారత నౌకలు ఉన్నాయని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని అధికారులు చెప్పారు.