Renu Desai | ప్రముఖ టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ‘ధురంధర్’ సినిమాపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ 2’ చిత్రాన్ని తాజాగా వీక్షించిన ఆమె, సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూనే రాజకీయపరమైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, “నేను బీజేపీకి మరియు మన దేశ ప్రధాని మోదీకి గర్వించదగ్గ అంధభక్తురాలిని (Proud Andhbhakt) అని ఆమె పేర్కొన్నారు. సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్ర “ఈ ఛాయ్‌వాలా భారత్‌లోకి వచ్చాక మనవాళ్లలో భయం పెరిగింది” అని చెప్పే డైలాగ్‌ను ఆమె రీ-షేర్ చేస్తూ మోదీ నాయకత్వాన్ని కొనియాడింది.
అంతేకాకుండా, దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ దళాలు మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పట్ల కనీస గౌరవం లేకుండా, దేశం గురించి తప్పుగా మాట్లాడే వారు ఖచ్చితంగా ‘ధురంధర్’ సిరీస్ చూడాలని ఆమె సూచించారు. 2025లో ఘనవిజయం సాధించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా, స్పై యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ సినిమా అధికార పార్టీకి చెందిన ప్రాపగండా సినిమా అంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు పలువురు నటులు విమర్శలు గుప్పించారు.