Shakira India | ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా భారతదేశంలో నిర్వహించాల్సిన సంగీత కచేరీలు అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తుంది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జోమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్’ (District) ప్లాట్‌ఫారమ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10, 11 తేదీల్లో ముంబైలో, అలాగే ఏప్రిల్ 15న ఢిల్లీలో ఈ వేడుకలు జరగాల్సి ఉంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత షకీరా భారత్‌లో ప్రదర్శన ఇవ్వబోతుండటంతో భారీ ఎత్తున టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా షకిరాతో పాటు, అభిమానుల భద్రతే తమకు ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి 5 నుంచి 7 పని దినాల్లో పూర్తి డబ్బు వెనక్కి ఇస్తామని (Refund) హామీ ఇచ్చారు. కాగా, కేవలం కాన్సర్ట్ టికెట్లే కాకుండా విమాన ప్రయాణాలు, హోటల్ బుకింగ్స్ చేసుకున్న అభిమానులు ఈ హఠాత్తు నిర్ణయంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.