మాదాపూర్, నవంబర్ 12: కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌వో అంచనాలు అనేకమార్లు తప్పాయని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం పబ్లిక్ హెల్త్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్-2021 ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. డబ్ల్యూహెచ్‌వో అంచనాలు వాతావరణ సూచనలాంటివని, కొవిడ్ ప్రారంభ సమయంలో అది వెల్లడించిన విషయాలు చాలా వరకు తప్పులుగా తేలాయని చెప్పారు. కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్రం అనేక చర్యలు చేపట్టి దవాఖానలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో అమర్చేలా చర్యలు తీసుకోవడంతో అన్ని దవాఖానల్లో అవి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి ప్రజలు కరోనా నుంచి పూర్తిగా విముక్తిపొంది సాధారణ జీవితం గడుపుతారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. డబ్ల్యూహెచ్‌వో భారత అధికారి డాక్టర్ అనూజ్ శర్మ మా ట్లాడుతూ.. కొవిడ్ ప్రారంభ దశలో కొందరు నిపుణులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను తాము వెల్లడించామని, అవి ఆ తరువాత తప్ప ని తేలిందని పేర్కొన్నారు. యాంటిమైక్రోబయాల్ రెసిస్టెంట్స్ అనేది కొత్త రకమైన వ్యాధి అని ప్రజలు జాగ్రత్తలు పాటించడంతోనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో అక్సిజన్ను అందుబాటులో ఉంచామని రాష్ట్ర ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ మూర్తి మాట్లాడుతూ.. మశూచి, పోలియో వంటి వ్యాధులు దూరం కావడానికి కొంత సమయం పట్టిందని, కొవిడ్‌కు కూడా కొంత సమయం పడుతుందని తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 75కు పైగా స్టాల్స్ కొలువుదీరాయి. ఈ ప్రదర్శనలో దేశంలోనే మొట్టమొదటిసారిగా నాన్ యూవీ ఎల్ఈడీ లైట్‌ను ఆవిష్కరించారు.