Asteroid | పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన ఓ గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) నిశితంగా పరిశీలిస్తున్నారు. 2024 YR4గా నామకరణం చేసిన ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం వరకు ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఈ సంఘటన జరిగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ వర్గాల దృష్టిని ఆకర్షించేంత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. సుమారు 60 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం చంద్రుడిని తాకితే అది మధ్యస్థ థర్మోన్యూక్లియర్ పేలుడుతో సమానమైన శక్తిని విడుదల చేస్తుందని బీజింగ్‌లోని త్సింగ్‌హువా యూనివర్సిటీకి చెందిన యిఫాన్ హీ నేతృత్వంలోని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని arXivలో ప్రీప్రింట్గా విడుదల చేశారు.
ఈ సంఘటన చోటు చేసుకుంటే చంద్రుడిపై సుమారు ఒక కిలోమీటర్ వెడల్పు గల గొయ్యి (క్రేటర్) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రిక్టర్ స్కేల్‌పై సుమారుగా 5 తీవ్రత కలిగిన మూన్ క్వేక్ సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా చంద్రుడి అంతర్గత నిర్మాణంపై విలువైన సమాచారం లభించే అవకాశముంది. ఇప్పటివరకు చంద్రుడి లోపలి నిర్మాణాన్ని నేరుగా అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగానే నిలిచింది. ఈ ఢీకొనడం కారణంగా పెద్ద మొత్తంలో ధూళి, రాళ్లు అంతరిక్షంలోకి ఎగసిపడతాయి. వాటిలో కొంత భాగం కొన్ని రోజుల తర్వాత భూమి వాతావరణంలోకి ప్రవేశించి అత్యంత అరుదైన, భారీ ఉల్కా వర్షం (మీటియర్ షవర్)గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం ప్రాంతాల్లో ఈ దృశ్యం కళ్లకు కట్టినట్లు కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. గరిష్ట స్థాయిలో గంటకు లక్షల నుంచి కోట్ల ఉల్కలు భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సిమ్యులేషన్లు సూచిస్తున్నాయి.
అయితే ఈ ఘటనలో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూమిపై పడే శకలాలు ఆస్తి నష్టానికి కారణమయ్యే అవకాశం ఉందని, అంతరిక్షంలో తిరిగే శకలాలు ఉపగ్రహాలను ఢీకొట్టే ప్రమాదం ఉందని స్పేస్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ఇది కెస్లర్ సిండ్రోమ్ అనే ప్రతిచర్యకు దారితీసి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలను దెబ్బతీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ ప్రమాదాల నేపథ్యంలో గ్రహశకలాన్ని దారి మళ్లించే (డిఫ్లెక్షన్) మిషన్ చేపట్టాలా వద్దా అనే అంశంపై అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు చర్చలు నిర్వహిస్తున్నాయి. ఓ వైపు భూమి భద్రత, మరోవైపు అరుదైన సహజ శాస్త్రీయ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం.. ఈ రెండింటి మధ్య సమతౌల్యం పాటించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.