హైదరాబాద్, మార్చి 11 (హైదరాబాద్): ఏటా ఒకేపంట వేయటంవల్ల భూములు నిస్సారమై దిగుబడి తగ్గిపోతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులు తమ పొలాల్లో పంటమార్పిడి విధానాలను అవలంభిస్తేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని తెలిపారు. అన్నపూర్ణగా పిలవబడిన ఆంధ్రప్రదేశ్‌లో వరి ధాన్యం దిగుబడి పూర్తిగా పడిపోయిందని, ఒకే పంటను ఏండ్లతరబడి సాగుచేస్తే భూముల్లో మార్పు వచ్చి అదే పరిస్థితి వస్తుందని చెప్పారు. అందుకే వినూత్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీలో వ్యవసాయ పద్దుపై చర్చలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కొందరు రాజకీయ స్వలాభం కోసం రైతులను బలిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆగ్రహాన్ని టీఆర్ఎస్పైకి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని, కానీ రైతులకు అవన్నీ తెలుసని పేర్కొన్నారు. ప్రపంచానికి అన్నిరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే సత్తా భారత్‌కు ఉన్నదని చెప్పారు. కేంద్రం విధానంతోనే దేశం మరింత వెనక్కి వెళ్తున్నదని విమర్శించారు. మొదటి ప్రధాని నెహ్రూ దార్శనికతను చెరిపేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ విప్లవం అత్యవరమని అన్నారు. కేంద్ర వ్వవసాయ విధానాలు భవిష్యత్తుకు ప్రమాదకరమని, రైతులే అప్రమత్తమై కేంద్రాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా పంట కాలనీల ఏర్పాటుకు కేంద్రం పూనుకోవాలని, దీనికోసం అన్ని రాజకీయ పక్షాలు కేంద్రాన్ని నిలదీయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. దూరదృష్టి, ఆలోచన లేని కేంద్ర విధానాలతో దేశం ప్రపంచం ముందు పలుచన అవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు పండించాలి? ఎంత పండించాలనే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో 2014లో సాగు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాలుండగా, 2021 నాటికి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు. 2014లో ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నులు మాత్రమేనని, 2021 నాటికి 3 కోట్ల టన్నులకు చేరిందని వివరించారు. కరోనాతో వ్యవసాయ యాంత్రీకరణలో ఇబ్బంది పడ్డామని, ఈ ఏడాదిలో బడ్జెట్లో కేటాయింపుల ప్రకారం యాంత్రీకరణ చేపడతామని తెలిపారు. పంటమార్పిడిపై రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించాలని, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. అనుకోని తెగులుతో ఈ సారి మిర్చి పంట దెబ్బతిన్నదని, నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకొంటామని హామీ ఇచ్చారు. కోతుల బెడదను తగ్గించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని తెలిపారు. రైతులు ఎవరిమీద ఆధారపడకుండా వ్యవసాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.