మరణానంతరం తన ఆస్తి ఎవరికి దక్కాలి? అనే విషయంపై పూర్తి క్లారిటీతో ఉన్నారు బిగ్‌బీ అమితాబ్. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తదనంతరం ఆస్తి పంపకాలు ఎలా జరగాలో బిగ్‌బీ వివరించారు. ‘నాకు ఇద్దరు పిల్లలు. అభిషేక్, శ్వేతా. నా ఆస్తిలో వీరిద్దరికీ సమాన వాటా ఉంటుంది. ఈ విషయంపై నేను, నాభార్య జయ ఎప్పుడో ఓ నిర్ణయానికొచ్చాం.
కూతురు ‘పరాయా ధన్’ అని అందరూ అంటారు. ఆమె మన సంప్రదాయాన్ని అనుసరించి తన భర్త ఇంటికి వెళ్లింది. అంతమాత్రం చేత నా కూతురు కాకపోదుకదా. నా ఆస్తి విషయంలో అభిషేక్‌కి ఉన్న హక్కులన్నీ నా కుమార్తె శ్వేతకు కూడా ఉంటాయి. నా మరణానంతరం నా ఆస్తిని వారిద్దరూ సమానంగా పంచుకుంటారు.
నా అభిప్రాయాన్ని అభిషేక్ గౌరవిస్తాడనే అనుకుంటున్నా. ఎందుకంటే తననెప్పుడూ నేను కొడుకుగా చూడ్లేదు. స్నేహితుడిగానే చూశా. మా ఇద్దరి బంధం మాటలకు అతీతమైనది.’ అని తెలిపారు బిగ్‌బీ. గత ఏడాది అమితాబ్ తనకెంతో ఇష్టమైన ‘జల్సా’ బంగ్లాను కుమార్తె శ్వేతా బచ్చన్ నందాకు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. దాని విలువ ఇప్పుడు 50కోట్ల పై మాటే అని సమాచారం.