కోదాడ, ఏప్రిల్ 17 : నిరుపేద కుటుంబాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ను అందివ్వాలనే సదాశయంతో 2012లో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) పేరిట సంస్థను ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు కోదాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు బల్గూరి దుర్గయ్య, మాతంగి ప్రభాకర్ రావు. పే బ్యాక్ టు ది సొసైటీ అని ప్రవచించిన రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రాన్ని కోదాడ ఎమ్మెస్ కళాశాల ఆవరణలో కరస్పాండెంట్ పందిరి నాగిరెడ్డి సహకారంతో వీరు సంస్థను నడిపిస్తున్నారు. ఇప్పటివరకు నిరాటంకంగా 14వ బ్యాచ్‌తో కలిపి 2 వేల మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు మెటీరియల్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.
గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ర్యాంకులు సాధించడం గమనార్హం. గతేడాది రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్‌తో పాటు వెయ్యి లోపు 14 ర్యాంకులు ఈ సంస్థ సాధించింది. కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షతో పాటు తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రవేశ పరీక్ష కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. అలాగే 2013లో వీఆర్ఏ, వీఆర్ఓ ఉద్యోగాలకు కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశం. మ్యాథ్స్ ఫిజిక్స్, ఆంగ్లం, బయాలజీ బోధించేందుకు తమ వంతు బాధ్యతగా ఇతర ప్రభుత్వ ఉపాధ్యాయులు గంధం బుచ్చారావు, ఎలమర్తి శౌరి, నందిపాటి సైదులు, ప్రైవేట్ ఉపాధ్యాయుడు చెరుకుపల్లి కిరణ్ ఉచితంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.
Kodada : ‘ఆస్క్’ తో నిరుపేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్
ఆస్క్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుర్గయ్య మాట్లాడుతూ.. కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో ఫీజులు చెల్లించలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మంచి భవిష్యత్ కల్పించేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న దాదాపు 60 శాతం మంది విద్యార్థులు ఎంట్రన్స్ లో ఉత్తీర్ణులై పాలిటెక్నిక్ లో చేరి ఉద్యోగాలు పొందుతుండడం తమకు సంతోషం కలిగిస్తుందన్నారు.
Kodada : ‘ఆస్క్’ తో నిరుపేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్