Mukesh Ambani | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రాముఖ్యతను కలిగి ఉంటున్నారు. ఇందుకు నైపుణ్యమొక్కటే కాదు.. భారతీయుల వ్యాపార చతురత, సామర్థ్యాలు కూడా కారణమే. ఆసియా దేశాల్లోని టాప్-20 సంపన్న కుటుంబాలకు సంబంధించి బ్లూంబర్గ్ విడుదల చేసిన తాజా జాబితానే ఇందుకు నిదర్శనం. ఇందులో భారత్‌కు చెందిన ఆరు కుటుంబాలున్నాయి మరి. టాప్-10లో నాలుగుంటే.. మొదటి స్థానం కూడా మనదే.
ధీరూభాయ్ అంబానీ వారసుల్లో ఒకరిగా వచ్చిన ముకేశ్ అంబానీ.. ప్రస్తుత భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎంతటి ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చమురు, గ్యాస్, రిటైల్, టెలికం, బ్రాడ్‌బాండ్, జ్యుయెల్లరీ తదితర రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తన వారసులనూ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబ సంపద విలువ అత్యధికంగా రూ.7.85 లక్షల కోట్లు (90.5 బిలియన్ డాలర్లు)గా ఉన్నట్టు బ్లూంబర్గ్ తెలిపింది.
బ్లూంబర్గ్ ఆసియా సంపన్న కుటుంబాల జాబితాలో భారత్‌కు చెందినవారిలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీయే కాకుండా.. మిస్త్రీ, జిందాల్, బిర్లా, బజాజ్, హిందుజా కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇందులో రూ.3.25 లక్షల కోట్ల (37.5 బిలియన్ డాలర్లు)తో మిస్త్రీలు నాల్గో స్థానంలో, రూ.2.43 లక్షల కోట్ల (28.1 బిలియన్ డాలర్లు)తో జిందాల్ ఏడో స్థానంలో, రూ.1.99 లక్షల కోట్ల (23 బిలియన్ డాలర్లు)తో బిర్లా కుటుంబం తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.