అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యల పట్ల మందడం రైతు సంక్షేమ సంఘం సభ్యులు( Amaravati farmers ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రెండు రోజుల క్రితం జగన్ అమరావతిని నదీ తీరాన నిర్మిస్తున్నారని చేసిన ఆరోపణలు అవగాహన రాహిత్యమని పేర్కొన్నారు.
గత పాలనను వైఎస్ జగన్ ఎక్కడి నుంచి పాలించారని, అసెంబ్లీని ఎక్కడి నుంచి నడిపించారని, మీ, ఇళ్లు, పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత హోదా లేని జగన్‌కు అమరావతిపై మాట్లాడే అర్హత లేదని ఆరోపించారు. అమరావతి పేరు ఎత్తితేనే కోపగించే జగన్‌కు ఇక్కడ ఉండే అర్హత లేదని, పక్కరాష్ట్రాల్లోకి వెళ్లి బతుకాలని సూచించారు.
5 సంవత్సరాల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేస్తే పరదాలు కట్టుకుని వెళ్లిన జగన్ కపట ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని, ఇంకా అమరావతి రైతులను బెదిరించే ప్రయత్నాలు సాగబోవని స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఎవరూ కూడా సహించరని అన్నారు.
నది ప్రవాహం అంటే తెలుసా అని జగన్‌ను ప్రశ్నించారు. ఎన్నో దేశాల రాజధానులు నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. అమరావతిపై వ్యతిరేక ప్రచారం మానుకోకపోతే పులివెందులకెళ్లి జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం జగన్‌ను శిక్షించకపోతే ప్రభుత్వం తప్పు చేసినట్లువుతుందని వెల్లడించారు.