Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో సినీ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మొదట ఈ సినిమాను మే 15న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. తాజాగా చిత్రబృందం అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది.
‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంప్రదాయ పట్టుచీరలో కనిపిస్తున్న సమంత చేతిలో తుపాకీ పట్టుకుని సీరియస్, యాంగ్రీ లుక్‌లో కనిపించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడగా.. తాజా పోస్టర్ ఆ హైప్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా సమంత గత కొంతకాలంగా విభిన్న కథలను ఎంచుకుంటూ నటిగా కొత్త కోణాలను చూపిస్తోంది. ఈ క్రమంలో ‘మా ఇంటి బంగారం’ కూడా ఆమె కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు అదనపు బలంగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సమంతకు గత కొంతకాలంగా సోలో హిట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.