నాగర్ కర్నూల్: విద్యతోపాటు సంస్కృతి, సాంప్రదాయాలను ( Culture and Traditions ) పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ సంతోష్ ( Collector Santosh) అన్నారు. ట్రెడిషనల్ డే ను పురస్కరించుకొని నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ( Medical College ) వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ వైద్య విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు బాగా చదివి రాణించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అనేక చర్యలు చేపట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకొని, ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి వైద్య విద్యార్థిపై ఉంటుందని పేర్కొన్నారు.
పట్టణాలు, నగరాల్లో వైద్య సేవలు సులువుగా అందుబాటులో ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ అసమానతలను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు సేవలందించడం ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేస్తుందని తెలిపారు.
వైద్య వృత్తి అనేది కేవలం డబ్బు సంపాదనకు సంబంధించినది కాదు. అది ఒక సేవా వృత్తి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పవిత్రమైన బాధ్యత వైద్యులపై ఉంటుంది. బాధ్యతను గుర్తించి, అవసరమైన వారికి సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాదేవి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.