న్యూఢిల్లీ: పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న క్రమంలో కేంద్రం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు (ఎన్ఎస్ఏబీ)ని పునర్వ్యవస్థీకరించింది. రా మాజీ చీఫ్ అలోక్ జోషిని ఎన్ఎస్ఏబీ హెడ్‌గా నియమించింది. ఇక నుంచి ఎన్‌ఎస్‌ఏబీలో ఆరుగురు సభ్యులుంటారు. అందులో ముగ్గురు మిలిటరీ నేపథ్యం కలిగిన వారు, ఇద్దరు ఐపీఎస్‌లు, ఒకరు ఐఎఫ్ఎస్ ఉంటారు. మిలిటరీ నుంచి సదరన్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఏకే సింగ్, మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, రేర్ అడ్మిరల్ మాంటీ ఖన్నాలను నియమించారు. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి బీ వెంకటేశ్ వర్మలతో బోర్డును ఏర్పాటు చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్‌పై చర్యలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ నియామకం జరిగింది.