ప్రతిభావంతులైన సినీ కళాకారులను ప్రోత్సహిస్తూ 1964లో నెలకొల్పిన నంది అవార్డుల స్థానంలో ప్రజా కళాకారుడు గద్దర్ పేరిట ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు’లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన విషయం విదితమే. గురువారం హైదరాబాద్‌లోని ఎఫ్డీసీ కార్యాలయంలో 2024వ సంవత్సరానికి సంబంధించిన ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జ్యూరీ చైర్మన్ జయసుధ అవార్డుల వివరాలను వెల్లడించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా, వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించిన అనంతరం విజేతల పేర్లను ప్రకటించడం జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ప్రకటించాల్సిన ఉత్తమ చిత్రాల వివరాలను త్వరలో వెల్లడిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘కల్కి 2898ఏడీ’ ప్రథమ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, రూరల్ తెలంగాణ నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ‘పొట్టేల్’ ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మించిన ‘లక్కీభాస్కర్’ తృతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక ఉత్తమ నటుడిగా ‘పుష్ప 2’ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపిక కాగా, ఉత్తమ నటి అవార్డును ‘35 చిన్న కథకాదు’ చిత్రానికి గాను నివేదా థామస్ గెలుచుకున్నారు. దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), దర్శకులు సుజిత్, సందీప్ (క) ,ప్రశాంత్‌రెడ్డి, రాజేష్ కల్లేపల్లి (రాజు యాదవ్), ఫరియా అబ్దుల్లా (‘మత్తు వదలరా 2’లోని ‘ర్యాప్’ సాంగ్‌కి) స్పెషల్ జ్యూరీ అవార్డులను గెలుచుకున్నారు.
తొలిసారిగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని గెలుచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుకుమార్, మా నిర్మాతలు, పుష్ప టీమ్ మొత్తానికి చెందుతుంది. ఈ పురస్కారాన్ని నా అభిమానులకు అంకితమిస్తున్నా. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలే నాలో స్ఫూర్తినింపుతున్నాయి