లోక్‌సభలో నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు డిమాండ్
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)లో ఉత్తరభాగానికి అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం 180 కిలోమీటర్ల దక్షిణభాగానికి కూడా ఇవ్వాలని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు డిమాండ్ చేశారు. లోక్‌సభలో బుధవారం వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ చేపట్టాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి అనేక ప్రతిపాదనలు చేసిందని, వాటిని తక్షణమే ఆమోదించాలని కోరారు. కల్వకుర్తి-శ్రీశైలం రోడ్డును ఫోర్‌లైన్ చేయాలని విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వరకు రోడ్డును ఆరు లేన్లుగా మార్చాలని అన్నారు. దీనికి కేంద్రం ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకరించిందని త్వరగా చేపట్టాలని కోరారు. జోగులాంబ-గద్వాల జిల్లాలో ఎర్రవెల్లి చౌరస్తా దగ్గర రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. కోదాడ, నల్లగొండ, దేవరకొండ-కల్వకుర్తి -జడ్చర్ల జాతీయ రహదారిపై చారగొండ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగంగా పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు.