Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
Munaganoor Land Scam | సర్వే నంబర్లను ఏమార్చి దాదాపు రూ.200 కోట్ల విలువజేసే సర్కార్ భూమిని చెరబట్టేందుకు ‘బిగ్ బ్రదర్స్' అండతో కబ్జారాయుళ్లు చేస్తున్న ప్రయత్నాలు.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరులో వెలుగుచూశాయి.
Munaganoor Land Scam | రంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సర్వే నంబర్లను ఏమార్చి దాదాపు రూ.200 కోట్ల విలువజేసే సర్కార్ భూమిని చెరబట్టేందుకు ‘బిగ్ బ్రదర్స్’ అండతో కబ్జారాయుళ్లు చేస్తున్న ప్రయత్నాలు.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరులో వెలుగుచూశాయి. ఏకంగా అందులో విల్లాల నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతుల కోసం దరఖాస్తులు కూడా చేసుకున్న వైనం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ భూమికి సబ్‌డివిజన్ పేరుతో కొంతమంది కబ్జాదారుల చేత రెవెన్యూ అధికారులు ఏకంగా నాలా చెల్లింపులు జరిపించారు.
వాటి ఆధారంగా ఆ భూమిలో భారీ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం కోసం ఎచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటమే కాకుండా కబ్జారాయుళ్లకే కొమ్ముకాస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే భూమిపై గతంలో తీవ్ర దుమారం చెలరేగింది. భూ కబ్జాకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పలువురు సీపీఎం, సీపీఐ నాయకులు ఆ భూములను పరిశీలించారు. వాటిని వెంటనే నిషేధిత జాబితాలో చేర్చి కాపాడాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందనా లేదు.
సబ్‌డివిజన్ పేరుతో
మునగనూరులోని సర్వేనంబర్ 44లో సుమారు 40.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. దాన్ని కాజేసే ప్రయత్నాల్లో కబ్జారాయుళ్లకు రెవెన్యూ అధికారులు కూడా జతకలిసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే సర్వేనంబర్ 44ను సబ్‌డివిజన్‌గా విభజించి 44/1, 44/2, 44/3, 44/4తో పాటు 44/10, 44/11 కింద మార్చారు. ఇందులో 1 నుంచి 4 వరకు గల సబ్డివిజన్లతో పాటు 44 సర్వే నంబర్‌ను పూర్తిగా నిషేధిత జాబితాలో చేర్చారు. కాని, 44/10, 44/11లో ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తుల పేరిట పట్టాలుగా మార్చారు. వెంటనే ఆ భూమికి నాలా చెల్లింపులు కూడా జరిపారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఆ వ్యక్తులు భూమిలో విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఎచ్ఎండీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఎచ్ఎండీఏ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసినట్టు తెలిసింది. ఈ 12 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని, దాన్ని కబ్జారాయుళ్ల నుంచి కాపాడాలని స్థానికులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు కోరుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అప్పట్లో అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకొన్నారనే విమర్శలున్నాయి. సర్వేనంబర్ 44లో 40 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 12 ఎకరాలను పట్టా భూమిగా మార్చారు. మిగతాది ప్రభుత్వ భూమిగానే ఉన్నది. ఇందులో సర్వేనంబర్ 44/10, 44/11లో 12 ఎకరాల భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందనే చర్చ నడుస్తున్నది.
కబ్జారాయుళ్ల వెనుక బిగ్ బ్రదర్స్
మునగనూరు భూముల మేతలో కబ్జారాయుళ్లకు అండగా బిగ్ బ్రదర్స్‌తో పాటు ఓ ఎంపీ కూడా ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. అత్యంత ఖరీదైన ఈ భూముల్ని అందరూ పంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బ్రదర్స్, బడాబాబుల ఒత్తిడితోనే అధికారులు అటువైపు వెళ్లడం లేదని ఆరోపణలున్నాయి.
అనుమతులకు రంగం సిద్ధం
హైదరాబాద్ శివారు రంగారెడ్డిజిల్లాలోని అనేక విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు వెనుకాముందు చూడకుండా ఎచ్ఎండీఏ అనుమతులు జారీచేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఇదే అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కోహెడలో విల్లాల నిర్మాణానికి కూడా ఎచ్ఎండీఏ అనుమతిచ్చింది. ఈ విల్లాలు నిర్మిస్తున్న స్థలం ప్రభుత్వానివని, నాలాలను కూల్చివేసి నిర్మాణాలు చేపడుతున్నారని, అనుమతులను రద్దుచేయాలని నిరుడు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ లేఖ రాశారు. అయినా ఇప్పటి వరకు ఎచ్ఎండీఏ అధికారులు రద్దు విషయంపై ఎటూ తేల్చలేదు. ఇప్పుడు మునగనూరులోని సర్వేనంబర్ 44లోగల 12 ఎకరాల భూమికి కూడా అనుమతులిచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు ఆరోపణలున్నాయి. 12 ఎకరాల భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతున్నా వెనుకాముందు ఆలోచించకుండా అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

