‘నేను సరైన కామెడీ సినిమా చేసి పదేళ్లవుతున్నది. ‘నాంది’ తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు చేశాను. కానీ కామెడీని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు మిమ్మల్ని నవ్వించే చిత్రమిదని గ్యారెంటీ ఇస్తున్నా’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. ఇంద్రలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనక భూలోకంలోకి అడుగుపెడితే ఏం జరిగిందనే సంఘటనల నేపథ్యంలో టీజర్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘నేను చిన్నప్పటి నుంచి నాగార్జునగారికి పెద్ద అభిమానిని. ‘నా సామిరంగా’లో ఆయనతో కలిసి నటించా. ఇప్పుడు ఆయన బ్యానర్లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ఈ సినిమా థియేటర్లలో నవ్వులమోత మోగిస్తుందని, అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ బ్యానర్‌తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని నిర్మాత రాజేష్ దండా పేర్కొన్నారు. ఫాంటసీ, గ్రామీణ నేపథ్యాన్ని కలిపి ప్రేక్షకుల్ని నవ్వించాలనే లక్ష్యంతో సినిమా చేశామని దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.