హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో పట్టణస్థాయి మౌలిక వసతులను కల్పించడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. రూర్బన్ పథకం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నది. టాప్-1, 2 క్లస్టర్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినవే ఉండటం విశేషం. దేశంలోని మొత్తం 295 రూర్బన్ క్లస్టర్లలో సంగారెడ్డి జిల్లాలోని ర్యాకల్ క్లస్టర్, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ క్లస్టర్ వరుసగా తొలి రెండు స్థానాలను కైవసం చేసుకొన్నాయి.
పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించడం, వలసలను తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం లాంటి మొత్తం 14 అంశాలను ప్రామాణికంగా తీసుకొని క్లస్టర్లకు ర్యాకింగ్లు ఇచ్చారు. ర్యాకల్, జుక్కల్ క్లస్టర్లతోపాటు వీటితోపాటు తెలంగాణలోని అన్ని క్లస్టర్లు టాప్ 50లో నిలిచినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. వీటిలో గిరిజన క్లస్టర్లకు రూ.30 కోట్లు, గిరిజనేతర క్లస్టర్లకు రూ.15 కోట్ల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో నిధులను కేటాయించాయి.
తెలంగాణలో 3 దశల్లో మొత్తం 17 క్లస్టర్లను ఎంపికచేసి రూర్బన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. రూ.435 కోట్ల క్రిటికల్ గ్యాప్ ఫండ్ (సీజీఎఫ్) అంచనా వ్యయంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో రాష్ట్ర వాటాగా ఖర్చు చేయాల్సిన 40% కంటే అధికంగా నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో సమర్థంగా అమలుచేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. సీజీఎఫ్ ద్వారా కేంద్రం కేటాయించిన రూ.435 కోట్లకు రాష్ట్రం రూ.1,450 కోట్లను అనుసంధానించి మొత్తం 17 రూర్బన్ క్లస్టర్లలో రూ.1,885 కోట్లతో పనులు మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.1,574 కోట్లు (రూ.1,374 కోట్ల కన్వర్జెన్స్ నిధులు, రూ.200 కోట్ల సీజీఎఫ్ నిధులు) ఖర్చయ్యాయి. వీటి ద్వారా 555 గ్రామాల్లో 2.30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి.