హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పేదల ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల కోసం మానవీయ కోణంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, దళిత ఎమ్మెల్యేగా తాను గర్వపడుతున్నానని తెలిపారు. చాలా పథకాల అమలులో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉన్నదని వెల్లడించారు. బడ్జెట్ రూపకల్పనలో తెలంగాణ సర్కారు మినహాయిస్తే మిగతా ప్రభుత్వాలన్నీ ట్రికిల్ డౌన్ పాలసీని అవలంబిస్తూ, పాలనను వ్యాపార కోణంలోనే చూస్తున్నాయని అన్నారు. దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాగంలోని ఆర్టికల్ (3) వినియోగించి అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని సీఎం కేసీఆర్ సాధించారని, అందువల్లే దళిత బంధు వచ్చిందని తెలిపారు. 13 వేల మంది గిరిజన ఆవాసాలకు గిరిజన సర్పంచులు వచ్చారని వివరించారు. అటు.. డైనమిక్ లీడర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ రంగం దూసుకుపోతున్నదని అన్నారు. టీహబ్, వీహబ్ ద్వారా అభివృద్ధి చేపట్టారని, ఇతర దేశాలలో నేర్చుకొని వచ్చిన పాలకుడు కేటీఆర్ అని, ఆయన మార్గదర్శకత్వం యువతకు స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని గువ్వల కోరారు.