– రేపే మూడో విడత పోలింగ్
– 2.10 లక్షల మంది ఓటర్లు
హుజూర్నగర్, డిసెంబరు 16 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ డివిజన్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 17వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. డివిజన్లో హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెర్వు, గరిడేపల్లి, నేరేడుచర్ల, చింతలపాలెం, పాలకవీడు మండలాలు ఉన్నాయి. ఈ ఏడు మండలాల్లోని 124 గ్రామ పంచాయతీలకు 1,318 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 124 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం హుజూర్‌నగర్‌లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఎన్నికల సామగ్రిని పోలీసుల భారీ బందోబస్తు మధ్య మండలంలోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. డివిజన్లో 601 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
హుజూర్నగర్ మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు సంబంధించి అంజలిపురం సర్పంచ్ ఏకగ్రీవమైంది. మిగిలిన 10 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాలకు సంబంధించి 102 పోలింగ్ కేంద్రాలు, 102 వార్డులకు ఎన్నికలు నిర్వహించను న్నారు. మండలంలో 262 మంది పీఓలు, ఏపీఓలను నియమించారు. కాగా గ్రామాల వారీగా ఎన్నికలను తాసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పర్యవేక్షణ చేయనున్నారు. మండల వ్యాప్తంగా మహిళా ఓటర్లు 10,744మంది, పురుష ఓటర్లు 10,287 మంది ఉన్నారు. మండలంలో 8 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. మండలంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పోలింగ్ నిర్వహించి అక్కడే కౌంటింగ్ కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.