Lok Sabha | గత 15 సంవత్సరాల్లో వామపక్ష తీవ్రవాదానికి (LWE) సంబంధించిన హింసాత్మక సంఘనటలు తగ్గుముఖం 89శాతం వరకు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2010లో గరిష్టంగా 1,936 ఘటనలు నమోదవగా.. 2025 నాటికి 222కు చేరాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకువచ్చిన జాతీయ విధానం-కార్యచరణ ప్రణాళిక సమర్థవంతంగా అమలవుతోందన్నారు. పౌరులు, సిబ్బంది మరణాలు 2010లో గరిష్టంగా 1,005 ఉండగా.. 91శాతం తగ్గి 2025 నాటికి 95కు చేరాయని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల సంఖ్య ఏప్రిల్ 2018లో 126 నుంచి 90కి, జులై 2021లో 70కి, ఏప్రిల్ 2024లో 38కి, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 18, అక్టోబర్ వరకు కేవలం 11కి తగ్గాయన్నారు. ప్రస్తుతం మూడు జిల్లాలు మాత్రమే ప్రభావిత జిల్లాలుగా వర్గీకరించామన్నారు.
గిరిజన, మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం మావోయిజం మూల కారణాలను పరిష్కరించిందన్నారు. మెరుగైన శాంతిభద్రతలు, భద్రతా పరిస్థితులు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల పెరుగులతో సహా మెరుగైన ఆర్థిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరేలా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్రాలు సమగ్ర లొంగుబాటు-పునరావాస విధానాలను రూపొందించాయన్నారు. ఎస్ఆర్ఈ పథకం కింద లొంగిపోయిన వారి పునరావాసం కోసం రాష్ట్రాలు చేసిన ఖర్చును కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందన్నారు. పునరావాస ప్యాకేజీలో ఉన్నత స్థాయి కేడర్‌కు రూ.5లక్షలు, క్యాడర్‌కు రూ.2.5లక్షల తక్షణ గ్రాంట్ ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ స్కీమ్‌లో ఆయుధాలు, మందుగుండును అప్పగించినందుకు ప్రోత్సాహకాలు అందిస్తారన్నారు.
అదనంగా నచ్చిన వృత్తి, వ్యాపారంలో శిక్షణ ఇచ్చేందుకు మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.10వేల ఉపకార వేతనం అందించే సదుపాయం కూడా ఉంటుందన్నారు. రోడ్డు నెట్వర్క్ విస్తరణ, టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ మెరుగుదల, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితంపై ప్రత్యేక దృష్టి సారించి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర సహాయ మంత్రి వివరించారు. పదేళ్లలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 656 పోలీస్స్టేషన్లు, ఆరేళ్లలో 377 కొత్త ప్రత్యేక పోలీస్ శిబిరాలు ఏర్పాటు చేసిన మావోయిస్టులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు మంత్రి వివరించారు. 14,987 కిలోమీటర్ల రహదారులను నిర్మించడంతో పాటు టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు 9,118 టవర్లను ఏర్పాటు చేశామన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం 46 పారిశ్రామిక శిక్షణా సంస్థలు, 49 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి 179 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోస్టల్ శాఖ ఆయా జిల్లాల్లో బ్యాంకింగ్ సేవలతో కూడిన 6,025 పోస్టాఫీసులను ప్రారంభించిందని, భౌగోళిక రాజకీయ హింసతో అత్యంత ప్రభావితమైన జిల్లాల్లో 1,804 బ్యాంకు బ్రాంచ్‌లు, 1,321 ఏటీఎంలను ప్రారంభించారన్నారు. అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, వామపక్ష తీవ్రవాదంతో అత్యంత ప్రభావితమైన జిల్లాల్లోని కీలకమైన ప్రజా మౌలిక సదుపాయాల లోపాలను పరిష్కరించడానికి ప్రత్యేక కేంద్ర సహాయం (SCA) పథకం కింద నిధులను అందజేస్తున్నట్లు వివరించారు. 2017లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ.3,912.98 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.